కేంద్రం నుండి తెలంగాణకు వస్తున్న సాయం శూన్యమని, త్వరలో కేంద్రంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఎం సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం మాట్లాడుతూ.. హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో పని చేశారన్నారు. పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క కూడా యూత్ కాంగ్రెస్ నుండి వచ్చారని తెలిపారు. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని, ఎమ్మెల్సీ వెంకట్ టీమ్ జైల్లో ఉంటే రాహుల్ గాంధీ పరామార్శించి అండగా ఉన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పదవులు రావొచ్చు రాకపోవచ్చు కానీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలకు సీఎం పిలుపునిచ్చారు.
కేసీఆర్.. గట్టిగా కేటీఆర్ ను కొట్టాలి
మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా కొడతానంటూ చేస్తున్న కామెంట్స్ పై సీఎం సెటైర్లు వేశారు. ముందుగా కొడితే గట్టిగా కేటీఆర్ ను కొట్టాలని, పిచ్చి మాటలు మాట్లాడే కేటీఆర్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బులు ఉన్నట్లు ఆరోపించిన సీఎం, ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ముందుకు వచ్చి కేసీఆర్ నిలబడాలని, డబ్బులతో ప్రజల మనస్సులు గెలవలేరన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోలేదని. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఆ పార్టీ నేతలు సహించడం లేదన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే, ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
తెలంగాణ కోసం ఏమి తెచ్చారో..
తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నా, రాష్ట్రానికి తెచ్చింది జీరో అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా పన్ను చెల్లిస్తున్నారని, ఆ విషయాన్ని కేంద్రం జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బుగ్గకార్లలో తిరగడం కాదని, తెలంగాణ కోసం ఏమి తెచ్చారో చెప్పాలన్నారు. త్వరలో కేంద్రం పై పోరాటానికి కార్యాచరణ ఉంటుందని, అందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే అనుబంధ విభాగాలకు 37 కార్పొరేషన్ పదవులు ఇచ్చామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్ట పడ్డ యూత్ కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పని చేయకుండా దండం పెడతాం అంటే పదవులు మర్చిపోండి అంటూ హెచ్చరించారు. ధాన్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నెరువేరుస్తామంటూ సీఎం ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారని, దేశంలో ఏ రాష్ట్రం చేయనంత రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.