TELANGANA

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్..

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?.. సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ పై జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయింది. దీంతో సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు ధర్మాసనం మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది.

 

ముత్తంగింలో జరిగిన కూల్చివేతలపై ఫిబ్రవరి 20న స్వయంగా హాజరుకావాలని హైడ్రా ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ ను కోర్టు ఆదేశించింది. దర్యాప్తు లేకుండానే కూల్చివేతలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్క్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ గాయత్రి సభ్యుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైడ్రా నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. భూమి మార్పిడి చర్యలు, అమ్మకపు పత్రాలు, పంచాయతీ అనుమతులను సమర్పించినప్పటికీ తమను విచారించకుండా హైడ్రా ఏకపక్షంగా నిర్మాణాన్ని కూల్చివేసిందని పిటిషనర్ తెలిపారు.

 

ఈ క్రమంలో డాక్యుమెంట్లు సమర్పించడానికి హైడ్రా 24 గంటల సమయం కూడా ఇవ్వదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జూన్ 8న నోటీసు ఇచ్చి, జూన్ 9న కూల్చివేత జరిగిన మునపటి కేసును ఆయన ఉదహరించారు. హైడ్రా చర్యలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన చేశారు.ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్ లను కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు. అనుమతులు లేని లేఔట్లలో కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉందని ఆయన పేర్కొన్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు.