TELANGANA

ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. వాటిపై చర్చించే అవకాశం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా.. కేవలం ఉప ఎన్నికలపై ఫోకస్ చేశారా? అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

 

ఎంతమంది హాజరు?

 

బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దాదాపు 400 మంది పార్టీ కీలక నేతలకు రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్‌లు హాజరవుతున్నారు.

 

ఫ్యూచర్ ప్లానేంటి?

 

ఈ భేటీలో పార్టీని సంస్థ గతంగా పార్టీని బలోపేతం చేయడం, చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ తన ఆలోచనలను నేతలకు వివరించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఏప్రిల్ నాలుగో వారానికి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

 

ముఖ్యంగా ఏప్రిల్ లేదా మేలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసేలా వ్యూహరచన చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగితే ఈనెల చివరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు కేసీఆర్. ఎన్నికలు మరింత డిలే కావడంతో దాన్ని కొద్దిరోజులు ఆపాలని ఆలోచన చేస్తున్నారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డిలో సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఎందుకోగానీ నేతలు ముందుకు రాలేదని అంతర్గత సమాచారం.

 

ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు. అదే రోజు ప్రతినిధుల సభ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన పోరాటాలపై సమీక్ష, భవిష్యత్తు వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్.

 

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల పోరాటానికి కేడర్‌ను సిద్ధం చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా, లగిచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలు, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు వేయనున్నారు. పార్టీ కేడర్, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

 

ఉప ఎన్నికలపై ఫోకస్?

 

మార్చిలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఇదిలాఉండగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాడుతోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జులను నియమించాలని భావిస్తున్నారట కేసీఆర్. దీనివల్ల పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించడం ఈజీ అవుతుందనే లెక్కలు వేస్తోందట ఆ పార్టీ నాయకత్వం.