తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం రూ.16 వేల కోట్లను మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఏటా తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 5 వేల కోట్లను వెచ్చిస్తుందని గుర్తు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల తాగు, సాగునీటి పారుదల శాఖ మంత్రుల రెండో సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర అవసరాలపై మంత్రి సీతక్క ప్రజెంటేషన్..
కేంద్ర జల శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గోన్న సదస్సులో, తెలంగాణ అమలవుతున్న మిషన్ భగీరథ, ఇతర తాగు నీటి పథకాలను వివరించడంతో పాటు రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశ స్వాతంత్రం నుంచి నేటి వరకు దేశంలో, తెలంగాణ ప్రాంతంలో తాగు నీటి సరఫరా కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను మంత్రి సీతక్క ప్రస్తావించారు. మారిన జీవన పరిస్థితులు, ప్రజల అవసరాల నేపథ్యంలో ఊరుమ్మడి బావి నుంచి ఇంటింటికి నల్లా ఏర్పాటు వరకు సాధించిన పురోగతిని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేయి కోట్ల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల వివరాలను ప్రస్తావించారు.
నీరు మానవాళి మనుగడకు జీవనాధారం..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదని.. అది మానవాళి మనుగడకు జీవనాధారమని పేర్కొన్నారు. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని పొందడం ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కుని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే అన్నారు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగు నీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ తాగు నీటి సరఫరాను పెంపొందించడంలో పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహద పడ్డాయని మంత్రి సీతక్క గుర్తు చేశారు. కేంద్రంలో గత ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల 1980 నాటికే.. 83% గ్రామీణ ప్రాంతాలకు కనీసం ఒక తాగునీటి వనరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ (RGNDWM), నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం (NRDWP) వంటి కార్యక్రమాలు సురక్షితమైన మంచినీటిని అందించడానికి కృషి చేసాయని తెలిపారు. దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి నల్లా నీల్లిచ్చే పథకాన్ని అమలు పరుస్తోందన్నారు మంత్రి సీతక్క.
మిషన్ భగీరథలో లోపాలను సరిదిద్దుతున్నాం..
ప్రతి వ్యక్తికి సురక్షిత మంచి నీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ నీటి సరఫరా (RWS) వ్యవస్థను వేల కోట్ల ఖర్చుతో అప్పటి ప్రభుత్వాలు బలోపేతం చేశాయని గుర్తు చేశారు సీతక్క. ఇందులో బాగంగా 1,59,312 చేతి పంపులను, 14,054 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు (SVS), 149 మల్టీ విలేజ్ స్కీమ్‌లు (MVS), వేలాది పైప్డ్ వాటర్ సప్లై (PWS) స్కీంలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, లక్షలాది నల్లా కనెక్షన్లతో ప్రజల తాగు నీటి అవసరాలు తీర్చాయన్నారు. అయితే గతంలో ఉన్న తాగు నీటి సరఫరా పథకాలు, మౌలిక సదుపాయాలను అనుసంధానం చేస్తూ ప్రతి మనిషికి రోజుకు సగటున వంద లీటర్ల నీటిని సరఫరా చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం 2016 లో మొదలయ్యిందని చెప్పారు. రూ. 28 వేల కోట్ల రుణాలతో ప్రారంభమైన మిషన్ భగీరథ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్ది, మరింత పటిష్ట పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందిస్తున్నాం..
తమ ప్రభుత్వం తాగునీటి స్థిరీకరణ లక్షంగా పనిచేస్తుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేసే క్రమంలో కొన్ని సార్లు సమస్యలు తలెత్తుతున్నాయని, ఆయా రిజర్వయర్లలో నీటి కొరత తలెత్తినప్పుడు మిషన్ భగీరథ వ్యవస్థ నిరూపయోగంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే లోకల్ సోర్స్ లను వినియోగించుకునేందుకు వీలుగా సమీపంలోని నీటి వనరులను గుర్తించి తాగు నీటి అవసరాలను వాడుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణకు, తన ములుగు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు, గూడాలకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలేరు రిజర్వాయర్ నుండి తాగునీటిని పంపింగ్ చేస్తున్నారని…అక్కడ, నీటి మట్టం తగ్గినప్పుడు ఎక్కువ దూరం పంపింగ్ చేయడం సాధ్యం కావడం లేదన్నారు. అందుకే తన నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఉన్న పాకాల సరస్సు వద్ద ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. వేయి కోట్ల వ్యయంతో అనేక నియోజకవర్గాలకు తాగు నీరిచ్చేలా 18 ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు.
టోల్ ఫ్రీ సేవలను అందుబాటులోకి తెచ్చాం..
గత వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా స్థానిక వనరుల నుంచి నీటిని ప్రజలకు అందించేందుకు తమ ప్రభుత్వం రూ.300 కోట్లు వెచ్చించిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు తీవ్రంగా దెబ్బతిన్నా…తాత్కాలిక ప్రాతిపదికన స్థానిక వనరుల నుండి తాగు నీటిని అందించడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. మిషన్ భగీరథ ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా నీటి సరఫరా, నిర్వహణ వ్యవస్థను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం 24గంటల పాటు పనిచేసేలా టోల్ ఫ్రీ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే మిషన్ భగీరథను మరింత పటిష్టపరించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం ఆర్దిక చేయుత నివ్వాలని కోరారు మంత్రి సీతక్క.
రూ.28వేల కోట్ల రుణాలు తీసుకున్నాం..
మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ. 28 వేల కోట్లను బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకున్నామన్నారు. ఏటా రూ. 1,185 కోట్లను వార్షిక వడ్డీ ల రూపంలో చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇవి కాకుండా నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం ఏటా రూ. 1,527 కోట్లను వెచ్చిస్తున్నామని తెలిపారు. బ్యాంకులకు వార్షిక చెల్లింపులు, కొత్త ప్రాజెక్టులు, కనెక్షన్ల కోసం మొత్తంగా ఏటా రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలే తప్ప ఇప్పటి వరకు నిధులు రాలేదని మంత్రి సీతక్క గుర్తు చేసారు. అందుకే గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన చేసిన విధంగా కనీసం రూ. 16 వేల కోట్లను తెలంగాణకు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు మంత్రి సీతక్క.