TELANGANA

హరీశ్ రావుపై కక్షగట్టి ఇరికించాలని చూస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై కక్షగట్టి… నేర చరిత్ర ఉన్న చక్రధర్ అనే వ్యక్తితో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని… కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. ఏదో ఒకటి చేసి హరీశ్ ను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

యాదాద్రిలో రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఒట్టు పెట్టారని… ఆ మాట నిలుపుకోలేదని హరీశ్ రావు ప్రశ్నిస్తే అక్కడ కూడా కేసు పెట్టారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరులో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న అంశాల్లో కూడా హరీశ్ పై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రేవంత్ మాదిరి హరీశ్ ఓటుకు నోటు కేసులో లేరని చెప్పారు.