ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఐదు ప్రధాన అంశాలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైల్ ప్రాజెక్ట్, డ్రైపోర్ట్, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని, సెమీకండక్టర్ల ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరతపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రధానితో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఐదు రాష్ట్ర విజ్ఞప్తులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అవసరం అని స్పష్టం చేశారు. క్యాబినెట్ ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ లదేనని అన్నారు. ఈ ఐదు ప్రాజెక్టులు సాధించుకుని వస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతానని అన్నారు. మెట్రో విస్తరణ అంశం కేంద్ర క్యాబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అటు, బీఆర్ఎస్ నాయకత్వంపైనా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందారని వివరించారు. కేటీఆర్ బిజినెస్ పార్టనర్ కేదార్ దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయారని, ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు అని రేవంత్ వెల్లడించారు.
ఈ మిస్టీరియస్ మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. వీటిపై ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడంలేదని నిలదీశారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు వచ్చాకే మాట్లాడతానని అన్నారు.