TELANGANA

ఒంటిపూట బడులపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎప్పటినుండి అంటే..?

ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో, ఒంటి పూట బడుల నిర్వహణ పైన విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గతం కంటే ముందుగానే ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు.

 

ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రోజురోజుకూ ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకూ మధ్యాహ్న పూట స్కూల్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.

 

ముందస్తు అమలు

అయితే, తాజాగా ప్రభుత్వానికి వస్తున్న వినతులతో ఈ నెల 10వ తేదీ నుంచే ఒంటి పూట బడుల నిర్వహణ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. దీని పైన విద్యా శాఖ అధికారులు అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.ఇప్పటికే రంజన్‌ పండగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైనాయి. విద్యా శాఖ నుంచి ప్రభుత్వానికి ఒంటి పూట బడుల పైన నివేదిక సమర్పించారు. ప్రతీ ఏటా తరహాలోనే ఒంటి పూట బడుల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా.. పెరుగుతున్న ఎండల కారణంగా ముందుగానే ప్రకటించాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో, తెలంగాణలోనూ ఇదే విధంగా అమలు చేసేలా తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే, పెరుగుతున్న ఎండలతో 10వ తేదీ నుంచే అమలు పైన కసరత్తు కొనసాగుతోంది. ఈ సారి ఎండ‌లు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఈసారి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది