TELANGANA

రాములమ్మకు MLC పదవి..?

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళ అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. అయితే ఊహించని విధంగా విజయశాంతి పేరు తెర పైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంఛార్జి థాక్రె హామీ ఇచ్చిన నేపథ్యంలోనే విజయశాంతికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఐతే, ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్‌తో అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాకుండా.. పార్టీకి చాలా రోజులుగా విధేయంగా ఉన్నవారికి, కీలక వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది

 

శానా ఏళ్ల తర్వాత తెరపైకి రాములమ్మ

 

గత కొన్ని రోజుల నుంచి పలువురి సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే లాస్ట్ మినిట్ లో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి రావడం ఎవరూ ఊహించలేదు. బీజేపీ లో ఎలాంటి ఐడెంటిటీ రాలేదన్న బెంగతో అసెంబ్లీ ఎన్నికల ముందు విజయశాంతి హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీలో చేరే సమయంలో ఆమెకు సముచిత స్థానం ఇస్తామని విజయశాంతికి హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత రాములమ్మకు రేవంత్ సర్కార్ లో పదవీ రావడంతో ఇప్పుడు అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.

 

విజయశాంతి 2005లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. 2008లో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ సమయంలోనే రాములమ్మ మెదక్ నియోజకవర్గానికి జరిగన ఉపఎన్నికలో గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీ నుంచి వైదొలిగారు. అనంతరం ఎక్కడా నిలకడ లేకుండా పార్టీలు మారారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మారినా.. ఫైర్ బ్రాండ్ అయిన రాములమ్మకు ఏ పార్టీలో పదవి దక్కలేదు. దీంతో పలు సార్లు ప్రత్యక్షంగానే మీడియా ఎదురుగా అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే ఇన్నేళ్ల తర్వాత రాములమ్మను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది.

 

అద్దంకి అసంతృప్తికి పులిస్టాప్

 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా.. బలమైన గొంతుగా ఉన్న అద్దంకి దయాకర్ ను ఏఐసీసీ పెద్దలు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందని అద్దంకి ఆశించారు. అయితే లాస్ట్ మినిట్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సార్లు అద్దంకి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. చివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు అవ్వడంతో అద్దంకి దయాకర్ అసంతృప్తికి పులిస్టాప్ పడింది.