TELANGANA

తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? కేటీఆర్ తీవ్ర విమర్శలు..

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా చేసిందేం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

అయోధ్య తలంబ్రాల పేరుతో రేషన్ బియ్యం పంచి ఎంపీ ఎన్నికల్లో ఒక్కసారి గెలిచారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సెంటిమెంట్ పూసి.. మాయ చేశారు తప్ప.. తెలంగాణ రాష్ట్రంలో వారి ఆటలు ఎప్పుడూ సాగలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ది చేశారా..? అని బండి సంజయ్ ను అడిగితే.. ఏ చెబుతారు.. ఏం చెప్పరు.. ఎందుకంటే ఆయనకు ఏం తెలియదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు ఒక్కటి మాత్రమే తెలుసనని.. ఎక్కడైనా మసీదును కూలగొడుదామా..? అక్కడ శవం దొరికితే మీది.. శివం దొరికితే మాది అంటారని ఎగతాళి చేశారు. అదొక్కటే ఆయనకు తెలుసనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లేకుంటే అన్నా ఇయ్యాలా ఏం వారం.. రేపే వారం.. ఎల్లుండి ఏ వారం అని అడుగుడు తెలుసనని.. అంతే తప్ప బీజేపీ నాయకులు రాష్ట్రానికి ఏం తెచ్చిందు లేదు. ఓ దేవాలయాన్ని నిర్మించింది లేదని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

 

ఒక్కసారి వారికి ఓటు వేసి తప్పుడు పార్టీని, పాలకులను ఎన్నుకున్నందుకు ఐదేళ్ల శిక్ష పడిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేల్కోవాలని.. మంచి పాలకులను ఎన్నుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మూడు ప్రయోగాలు చేసిందని ఆరోపించారు. ఆ మూడు అసూయ, ద్వేషం, ఆశ అని చెప్పారు. స్థానిక నాయకత్వం పై అసూయ నింపారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పై ద్వేషం పెంచారని ఆరోపించారు. ఇక ప్రజలకు పలు ఆశలు జూపి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఓటర్లకు రూ.15వేల రైతు బంధు, తులం బంగారం, ఫించన్ ల రెట్టింపు చేస్తామని నోటికి వచ్చినట్టు ఆశ చూపించారని చెప్పారు. వాళ్ల ప్రయోగాలు ప్రజలపై పనిచేయడంలో ప్రజల తప్పు ఏ మాత్రం లేదని అన్నారు. అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులదే తప్పు అని చెప్పారు. కేసీఆర్ ప్రజలకు చెప్పమన్నది సరిగ్గా చెప్పుకోలేక పోయాం అని.. ప్రజలకు సరైన రీతిలో చెప్పలేదని కేటీఆర్ చెప్పారు.

 

కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు రాష్ట్రం అభివృద్ది చెందిందని.. ఈరోజు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకకు పోతుందని కేటీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రం అభివృద్ధి పయనం వైపు వెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త మెంబర్ షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం అని చెప్పుకొచ్చారు. అలాగే కొత్త కమిటీలను నియమించుకుందామని చెప్పారు. ఆ కమిటీల్లో ప్రజల మద్య ఉండే నాయకులకు చోటు కల్పిద్దామని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ రాష్టాన్ని ఎలా అన్యాయం చేస్తున్నాయో వివరించేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీని కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దామని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లో 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా పనిచేయాలని చెప్పారు. 2028లో కేసీఆర్ ను మళ్లీ తిరిగి సీఎంను చేద్దామని శపథం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.