TELANGANA

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్…

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలాంటిది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏయే అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశమేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

కాంగ్రెస్ దార్శనికతను అద్దం పట్టేలా.. భారత్ సమ్మిట్ 2025 ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ లోని HICCలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సమృద్ధి భారత్ ఫౌండేషన్‌తో కలిసి ఈ కార్యక్రమ నిర్వహణ సాగనుంది. AICC కీలక నేతలతో పాటు.. ఈ సమావేశానికి 100 కిపైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

 

భారత్ సమ్మిట్ అనే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణు గోపాల్.. ప్రసంగించే అవకాశముంది. ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం అనే అంశాల్లో భారత దేశపు వారసత్వం గురించి ప్రముఖంగా చర్చించనున్నారు. అలాగే ప్రపంచ స్థాయి ఆలోచనా పరులు, సంస్కర్తలు.. విశేషంగా పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైజింగ్ అనే అభివృద్ధి నినాదాన్ని వినిపించనున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్త పెట్టుబడి దారులను ఆకర్షించనున్నారు.

 

రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్త.. రాజకీయ, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారు. వీరి ద్వారా ఆలోచింప చేసే కీలక ప్రసంగాలుంటాయి. అంతే కాదు ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, పారిశ్రామిక అంశాలపై విస్తృత చర్చలు సైతం సాగనున్నాయి. ప్రజా స్వామ్య తిరోగమనం, పెరుగుతున్న అసమానతల వంటి అంశాలపై కూడా వీరు చర్చించనున్నారు. ఇక భౌగోళిక రాజకీయ మార్పులు, ప్రపంచం ఎదుర్కుంటోన్న సవాళ్లకు ధీటుగా గ్లోబల్ జస్టిస్ అందించడం ఎలా? అన్న ఉద్దేశంతో ఈ సమ్మిట్ జరగనుంది.

 

ఈ సమ్మిట్ ద్వారా ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమాచార న్యాయానికి ఒక మార్గం సూచించే అవకాశమున్నట్టు చెబుతున్నారు నిర్వాహకులు. ప్రపంచ సహకారం, సామాజిక న్యాయం, సమానత్వం, మెరుగైన భవిష్యత్ నిర్మించేందుకు ఈ సమ్మిట్లో ప్రపంచ స్థాయి నాయకత్వం మమేకమవుతుందని అంటున్నారు.

 

కాగా ప్రజాస్వామ్య తిరోగమనం, పెరుగుతున్న అసమానతలు, భౌగోళిక రాజకీయ మార్పు చేర్పులు వంటి ప్రపంచ సవాళ్లకు ధీటుగా భారత్ సమ్మిట్- 2025 జరగనుందని చెబుతున్నారు. ఈ అంశాల పట్ల భారత జాతీయ కాంగ్రెస్ దార్శనీకతను సూచిస్తుందని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి ప్రతినిథులు హాజరవుతుండటంతో.. ఇప్పటికే నిర్వాహకులు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరో కీలక సమ్మిట్ కి వేదిక కానుండటంతో.. హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.