TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే… కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్‌ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కౌశిక్ రెడ్డిని వరంగల్‌కు తరలించారు.

 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.