తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ప్రకంపనలు.. వైజాగ్, హైదరాబాద్‌లో డాక్టర్లే డ్రగ్స్ కొంటూ ఇంతలా దొరుకుతున్నారేంటి? ఎందరికో ఆరోగ్య పాఠాలు చెప్పే డాక్టర్లే ఇలా డ్రగ్స్ వాడ్డమేంటి? అటు వైజాగ్ ఇటు హైదరాబాద్‌లోనూ సేమ్ సీన్.. ఈ మూడు కేసుల్లోనూ డాక్టర్లే కామన్ పాయింట్. గతంలో పట్టుబడ్డ డాక్టర్లు ఎవరు? ఎలాంటి వారు? డాక్టర్లు ఎందుకిలా డ్రగ్స్ కి బానిసలవుతున్నారు?
డాక్టర్లే ప్రమాదకర మాదక ద్రవ్యాలు వాడ్డమేంటి?తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఈగల్ టీం అధికారులు హైదరాబాద్ లో మరొక డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా దందా నడుస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ యాజమాని సూర్య ను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం డ్రగ్స్ నెట్ వర్క్ బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు ఈగల్ టీమ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మల్నాడు రెస్టారెంట్ యాజమాని సూర్య సిటిలోని పలు పబ్ లు, రిసార్ట్ లు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.
20 సార్లు డ్రగ్స్ కొన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ప్రసన్న
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న దాదాపు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు.. విచారణలో తేలిందని చెప్పారు అధికారులు. మొత్తం 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేశాడని అంటున్నారు. ప్రముఖ పబ్‌లు, రిసార్ట్ లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రిజం, ఫామ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, బ్రాడ్ వే పబ్ లలో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు గుర్తించారమన్నారు. వాక్ కోరా, బ్రాడ్ వే, పబ్ ల యజమానులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ రాజాశేఖర, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
లేడీ హైహిల్స్ లో డ్రగ్స్ పెట్టుకుని సరఫరా
కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు దాడి చేసి నెట్ వర్క్ గుట్టురట్టు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ తన హై హీల్స్ లో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సూర్యకు నైజీరియన్స్ డ్రగ్స్ పార్సిల్స్ అందజేసే వారన్నారు. మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య అతని మిత్రుడు హర్షలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే మల్నాడు హోటల్ లో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని… తమ ఓనర్ బంధువుల ఇష్యూు తమకు ముడి పెట్టవద్దని మల్నాడు హోటల్ జనరల్ మేనేజర్ అంటున్నారు.
వైజాగ్ లో కృష్ణ చైతన్య అనే డ్రగ్ డాక్టర్ అరెస్ట్
మొన్న విశాఖలోనూ ఒక డాక్టర్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతడి పేరు డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మ. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ చైతన్య వర్మను అరెస్టు చేసారు విశాఖ పోలీసులు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్‌కు లింకులున్నట్టు తేల్చారు.. కూర్మన్నపాలెం ఏ ప్లస్ హాస్పిటల్ కు సీఈవోగా పని చేస్తున్నారు డాక్టర్ కృష్ణ చైతన్య. డాక్టర్ చైతన్య కొకైన్ కోసం 60 వేల రూపాయలు ఇచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. డాక్టర్ కొకైన్ కు అలవాటు పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ కృష్ణ చైతన్యను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు.
డా. చైతన్యతో మూడుకు చేరిన అరెస్టుల సంఖ్య
డాక్టర్ చైతన్యతో.. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మూడుకు చేరింది. మరి కొంతమంది పాత్ర పైనా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే థామస్, అక్షయ్ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు విశాఖ పోలీసులు. 25 గ్రాముల కొకైన్.. 3.6 లక్షల నగదు సీజ్ చేశారు. వెల్డింగ్ మిషన్ తో పాటు.. కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.60 వేలు డాక్టర్ సమకూర్చినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. నిందితులకు ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
ప్రిన్స్, బుచ్చి అనే నిందితుల కోసం గాలింపు
ఢిల్లీకి చెందిన ప్రిన్స్, బుచ్చి అనే మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో డాక్టర్ పాత్ర బయటపడడంతో విశాఖలో తీవ్ర కలకలం చెలరేగుతోంది. డ్రగ్స్ కేసులో ఎంతటి వారి పాత్ర ఉన్నా సరే ఉపేక్షించేది లేదని అంటున్నారు పోలీసులు. కాగా రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం EAGLEతో కలిసి నగర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో గత శనివారం ఢిల్లీలో రూ.15 లక్షల విలువైన 25 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
డా. నమ్రత చిగురుపాటి అనే డాక్టర్ అడ్డంగా బుక్
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన డా. నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకెయిన్‌ను డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడంతో అదో సంచలనంగా మారింది. రూ.5 లక్షల విలువైన మాదర ద్రవ్యాలను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా పోలీసులకు దొరికిపోయారామె. ఈ లేడీ డాక్టర్ కి.. డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, ఈమెకు కొకెయిన్‌ను సరఫరా చేసిన ప్రధాన నిందితుడు వన్ష్ థక్కర్ మాత్రం పరారయ్యాడు.
2014లో ఎంబీబీఎస్ పూర్తి, 2022లో స్పెయిన్ లో MBA
డా. నమ్రతకు ఇద్దరు పిల్లులు. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. షేక్‌పేటలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2014లో పీరమ్చెరువులోని ఓ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ చేశారు. ఆ తరువాత 2017లో కొచ్చిలో రేడియేషన్ ఆంకాలజీలో ఎమ్డీ పూర్తి చేశారు. 2021-22లో స్పెయిన్‌లో MBA చేశారు. అక్కడ ఉండగా ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకు వచ్చాక కూడా తాను డ్రగ్స్ తీసుకోవాలని భావించినట్టు విచారణలో చెప్పారామె. ఇక్కడ స్థానిక డీజేల ద్వారా ఆమె తొలుత డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఆ తరువాత నమ్రత తన బాయ్‌ఫ్రెండ్ ద్వారా ముంబైకి చెందిన డ్రగ్స్ కింగ్‌పిన్ వన్ష్ థక్కర్ పరిచయమయ్యాడు. థక్కర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్‌గా పనిచేసే వాడినని బాలకృష్ణ పోలీసుల విచారణలో చెప్పాడు. ఇలా చేయడం వల్ల తనకు కమీషన్ వచ్చేదని అన్నాడు.
57 చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసిన ఏజెంట్
మే 8న హైదరాబాద్‌లో నమ్రత తన కారులో ఉండగా బాలకృష్ణ ఆమెకు కొకెయిన్ ఇచ్చాడు. మరో రూ.10 వేలు అదనంగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేశామని చెప్పారు రాయదుర్గం పోలీసులు. ఈ డీల్‌కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఏడాదిగా థక్కర్ నుంచి ఆమె కొకెయిన్ కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. నెలకోసారి డ్రగ్స్ కొంటారు. డ్రగ్స్ డెలివరీ ఎప్పుడు- ఎక్కడ చేసేదీ థక్కర్ వాట్సాప్‌లో సమాచారమిస్తాడు. ఈ మెసేజీలు వాతంతట అవే డిలీట్ అయిపోయేలా ఆమె మెసేజీ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకున్నారని చెప్పారు పోలీసులు. ఈ కొకెయిన్‌ను బాలకృష్ణ- 57 చిన్న చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసినట్టు వివరించారు పోలీసులు.