TELANGANA

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రెడీ.. నేటి నుండి పంపిణీ మొదలు..

దశాబ్ద తర్వాత తెలంగాణ వాసుల కల నెరవేరుతోంది. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి అంతా రెడీ అయ్యింది. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్రభుత్వం అధికారులు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రేవంత్ సర్కార్ ఒకొక్కటిగా అమలు చేస్తోంది.

 

తాజాగా జులై 14న అంటే సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సోమవారం నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

సోమవారం రోజు 5,61,343 కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం తర్వాత ఈ స్థాయిలో రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.

 

కార్డు రానివాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్నవాళ్లు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. బీపీఎల్ కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డుతోపాటు పచ్చ కార్డును ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 95,56,625కి చేరనుంది. ఈ కార్డుల వల్ల 3 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

 

రాష్ట్రంలో అత్యధికంగా అంటే ఒక్క నల్గొండ జిల్లాలో 50 వేల కొత్త రేషన్‌ కార్డులు రానున్నాయి. ఆ తర్వాత స్థానం కరీంనగర్. అక్కడ 31 వేల కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు. మంజూరైన కొత్త కార్డులతోపాటు కుటుంబసభ్యుల వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

రేషన్ కార్డు నెంబర్ లేకుంటే మీ-సేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా కార్డు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు తెలుస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌‌లో రిఫరెన్స్ నెంబర్ లేకుంటే కొత్త కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. జిల్లా పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే వివరాలు వస్తాయి.

 

వెబ్‌సైట్‌లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే మండల ఆఫీసు ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. లబ్దిదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో FSC Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో Ration Card Search డ్రాప్ డౌన్‌లో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

 

ఆ తర్వాత జిల్లా ఎంపిక చేసి క్లిక్ చేయాలి. మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.ఈ లిస్టులో పేర్లు ఉంటే కొత్త కార్డును పంపిణీ చేస్తారు. కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాల మాట.