TELANGANA

హైదరాబాద్ శివారులో భారీ భూ కుంభకోణం..! ఎంతంటే..?

800 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు. హైదరాబాద్ శివారులో మొయినాబాద్‌ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నంబరు 180లోని సర్కారు భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు స్పష్టమవుతోంది. మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. ఈ కుంభకోణం బయటపడింది.

 

హైదరాబాద్‌ శివార్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోశాల భూములపై స్థానిక రైతులకు, రెవెన్యూ అధికారుల మధ్య వివాదం నడస్తోంది. మరోవైపు తప్పుడు పత్రాలతో ఈ భూములు కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ మొదలు పెట్టిన రెవెన్యూ అధికారులు.. ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు నిర్ధారణకు వచ్చారు. దీని వెనుక గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

మొయినాబాద్ చుట్టుపక్కల ఎకరం 8కోట్ల రూపాయలు పలుకుతోంది. దీంతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు 2020లోనే దళారులు ఎంటరైనట్టు భావిస్తున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో వ్యూహం రచించారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారులకు ఎకరాల చొప్పున విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. స్థానికులకు విక్రయిస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతో స్థానికేతరులకు భూమిని అమ్మారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ భూమిని గోశాల నిర్మాణానికి కేటాయించింది. ఈనెల 7న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమి పూజ చేశారు. దీంతో స్థానికంగా సాగు చేసుకుంటున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఎకరాకు 800 చదరపు గజాల స్థలాన్ని ఇప్పించాలని పట్టుపడుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ భూమిని తాము కొన్నామని, తమకు భూయాజమాన్య హక్కులున్నాయని కొందరు సంప్రదించారు. దీంతో కుంభకోణం వెనుక చాలామంది ఉన్నట్టు తేలింది.