TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..! త్వరలోనే నోటిఫికేషన్..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేపోమాపో గంట మోగనుంది. దీనికి సంబంధించి పనులు తెరవెనుక వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసింది. వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గంట మోగనుంది. రాష్ట్రంలో 566 జడ్పీటీసీ సీట్లు, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 కాగా, వార్డుల సంఖ్య 1,12,000గా ఉన్నట్లు పేర్కొంది. దశాబ్దం తర్వాత ఒక్కసారి పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అది 2019లో మాత్రమే.

 

అప్పట్లో జడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 12,848గా ఉండేవి. ఆయా స్థానాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం అయ్యాయి.

 

దీంతో MPTC స్థానాల సంఖ్య 5,773కు తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ నిర్ణయంతో జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం దక్కనుంది. రిజర్వేషన్ విధానం ప్రకారం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలను మండల యూనిట్లుగా,జడ్పీటీసీలను జిల్లా యూనిట్లుగా, జడ్పీ చైర్‌పర్సన్లను రాష్ట్ర యూనిట్‌గా పరిగణిస్తారు.

 

రిజర్వేషన్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. దీనిని గవర్నర్‌కు పంపించారు. అక్కడ ఆమోదముద్ర పడిన తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. ఆర్డినెన్స్ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్‌లను దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

స్థానిక సంస్థల ఎన్నికలు ముక్కోణపు పోటీ జరగడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల ద్వారా గ్రామీణ స్థాయిలో పట్టు నిలుపుకోవాలని ఆలోచన చేస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరిగనుంది. సెప్టెంబరులో గ్రామ పంచాయతీలకు నిర్వహించేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.