APNationalTELANGANA

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై సీఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించింది. పాలమూరు- రంగారెడ్డి, దిండి, సమ్మక్కసాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొంది.

 

మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి: మంత్రి నిమ్మల

 

సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని చెప్పారు. ‘సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. నిపుణల కమిటీ ఇచ్చిన నివేదక ప్రకారం చర్యలు తీసుకుంటాం. కృష్ణా బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

 

ఈ నెల 21లోగా కేంద్రం కమిటీ..

 

నీటి వివాదాలపై ఈ నెల 21 లోగా కేంద్రం కమిటీ వేయనుంది. ఆ కమిటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉండనున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో సోమవారంలోగా కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు రాష్ట్రాలు అయినా ప్రజలు ఒక్కటే.. అందరికీ న్యాయం జరగాలి. కమిటీలో ఏపీ, తెలంగాణ నుంచి సభ్యులు ఉంటారు. కేంద్రం ఆధ్వర్యంలో ఆ కమిట పనిచేస్తుంది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలోనే టెక్నికల్ అంశాలపై చర్చ జరిగింది. . రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలీమెట్రీల ఏర్పాటుకు అంగీకరించాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.