ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో IAS అధికారి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను కొట్టేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన OMCకి గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకపాత్ర పోషించారనే అభియోగం ఉంది. ఇప్పుడు పిటిషన్ కొట్టేయడంతో సీబీఐ ఆమె పాత్రపై విచారణ చేపట్టనుంది.
శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది CBI. హైకోర్టులోనే OMC కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో విచారణ జరిపి ఇరు వాదనలు విన్న హైకోర్టు.. ఆమె డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టేసింది.
గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరుతో దోపిడీ చేసిన సమయంలో ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా శ్రీలక్ష్మి ఉన్నారు. లీజుల్లో అవకతవకలు దగ్గర నుంచి గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీలకు అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టడం వరకూ చాలా తప్పులు ఆమె చేతులు మీదుగా జరిగాయని సీబీఐ కేసులు పెట్టింది. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా ఆరోపించారు. అయితే ఈ కేసుతో తనకు ఏం సంబంధం లేదని సీబీఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కానీ సీబీఐ కోర్టు కొట్టి వేసింది. అదే పిటిషన్‌ను హైకోర్టులో వేశారు. 2022లో ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
హైకోర్టు తాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా డిశ్చార్జ్ చేశారని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మళ్లీ హైకోర్టులోనే విచారణ జరపాలంది. ఇప్పుడీ విచారణ ముగిసిన అనంతరం డిశ్చార్జ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరపనుంది.