TELANGANA

కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చెప్పింది నిజమే: బండి సంజయ్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, సిరిసిల్ల టికెట్ రావడానికి సీఎం రమేశ్ కేటీఆర్‌కు ఆర్థికంగా సాయం చేశారని, దాని వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని బండి సంజయ్ అన్నారు. సీఎం రమేశ్ తో చర్చకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో చర్చకు వేదిక తానే ఏర్పాటు చేస్తానని, మధ్యవర్తిత్వం కూడా వహిస్తానని చెప్పారు.

 

కేటీఆర్ వాడిన భాషను తీవ్రంగా తప్పుబట్టిన బండి సంజయ్, కేటీఆర్ భాషను మార్చుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను “తండ్రి, కొడుకు, అల్లుడు” పార్టీగా అభివర్ణించిన బండి సంజయ్, బీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

కంచ గచ్చబౌలి భూములు, ఓ రోడ్ కాంట్రాక్టు విషయంలో కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేయగా… సీఎం రమేశ్ అంతకు రెట్టింపు స్థాయిలో స్పందించడం తెలిసిందే. ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే, కేటీఆర్ తన వద్దకు వచ్చి వాపోయాడని సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో తాను జోక్యం చేసుకుని కేటీఆర్ కు టికెట్ ఇప్పించానని సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా? అని సవాల్ విసిరారు.