గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్‌లు, హాస్టల్స్ అడ్డాగా చేసుకొని మత్తులో ఉగుతున్న స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రిసాలబజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు పెడ్లర్లతోపాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం.. వారిలో ఇద్దరు యువతులు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ రిసాలబజార్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా
హైదరాబాద్‌లోని బొల్లారం రిసాలబజార్‌లోని ఓ పాఠశాల మైదానానికి తరచూ ఓ యువకుడు బైక్‌పై వచ్చి పదుల సంఖ్యలో వినియోగదారులకు గంజాయి అమ్ముతున్నట్లు ఈగల్ టీంకి సమాచారం రావడంతో రంగంలోకి దిగారు పోలీసులు. బైక్‌పై అనుమానాస్పదంగా వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా… 2 కిలోల గంజాయి దొరికింది. నిందితుడిని రిసాలబజార్‌కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. ఇతను రెండేళ్లుగా కర్ణాటకలోని బీదర్‌లో జరీనా బాను వద్ద గంజాయి కొని.. నగరంలో విక్రయిస్తున్నట్లు తేలింది.
ఇద్దరు గంజాయి సప్లయర్స్ అరెస్ట్.. 6 కిలోల గంజాయి సీజ్
అరాఫత్ అహ్మద్ ఖాన్ ఇచ్చిన సమాచారంతో ఈగల్ టీం జరీనా బానును ఇటీవల బీదర్‌లో అదుపులోకి తీసుకుంది. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఏడాదికాలంగా జరిగిన కోట్ల లావాదేవీలు బయటపడ్డాయి. ఇందులో 26 లక్షలు రుపాయలు హైదరాబాద్‌కు చెందిన 51 మంది గంజాయి పెడ్లర్లతో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన రెండు గంజాయి కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. ఆమె వద్ద అరాఫత్‌ఖాన్ 6 లక్షల లావాదేవీలు జరిపినట్లు తేల్చారు పోలీసులు.
టెస్టుల్లో ఇద్దరు విద్యార్థినులు సహా 9 మందికి పాజిటివ్
అరాఫత్ అహ్మద్ ఖాన్ వద్ద దాదాపు 100 మంది గంజాయి కొంటున్నట్లు విచారణలో తేలిందన్నారు ఈగల్ డీఎస్పీ నర్సింగ్‌రావు. ఇందులో ఓ వైద్య కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందిని పరీక్షించగా ఇద్దరు యువతులు సహా 9 మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా కాలేజీ హస్టల్‌లో ఉంటున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించారు పోలీసులు. మిగిలిన 8 మంది గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.