TELANGANA

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై బండి సంజయ్ సంచలన వాక్యాలు..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అంటే, మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు.

 

కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వారు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని అన్నారు. తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని అన్నారు.

 

మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీనింగ్ దుకాణాలు ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

భారతీయులు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు కలిగి ఉంటారని అన్నారు. తెలంగాణకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ దేశానికి చెందిన మార్వాడీలను గో బ్యాక్ అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఇతర దేశాలకు చెందిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రోహింగ్యాలు ఎంతోమంది పాతబస్తీని అడ్డాగా చేసుకున్నారని అన్నారు.

 

రోహింగ్యాల వల్ల తెలంగాణకు ప్రమాదముందని నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రోహింగ్యాల నుంచి హిందువుల కుల వృత్తులను కాపాడుకోవాల్సి ఉందని బండి సంజయ్ అన్నారు. ఓట్ల తొలగింపు అంశంపై కూడా ఆయన స్పందించారు. ఓట్ల తొలగింపు, చేర్పు ఎన్నికల సంఘం పని అని, బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.