TELANGANA

ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

 

కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

 

ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

 

రేపు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.