TELANGANA

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు: హరీశ్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు.

 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దర్జాగా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం ఇలాంటి అవస్థలు పడటం అత్యంత బాధాకరమని హరీశ్ అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు అనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ఆయన ఆయన ప్రశ్నించారు. రైతుల యూరియా కష్టాలను ఇంకెప్పుడు తీరుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతులందరికీ సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.