TELANGANA

వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు..: హరీష్ రావు..

రాష్ట్రంలో వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా” సీఎం తీరు ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒకవైపు ప్రజలు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటే, సీఎం మాత్రం మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ నిర్వహణపై సమీక్షలు చేయడం దారుణమని అన్నారు.

మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందంతో కలిసి పర్యటించిన హరీశ్ రావు, రాజాపేట గ్రామంలో వరద నీటిలో కొట్టుకుపోయి మరణించిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు అమాయకులు చనిపోయారని ఆరోపించారు. “రాజాపేటలో వరద ఉధృతికి ఇద్దరు వ్యక్తులు కరెంట్ స్తంభం ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు సహాయం కోసం ఎదురుచూశారు. ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఆ స్తంభం కూడా కొట్టుకుపోవడంతో వారు ప్రాణాలు విడిచారు” అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యవసరాలకు వాడాల్సిన హెలికాప్టర్‌ను పంపి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని, కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆయన అన్నారు. ఒక మంత్రి హెలికాప్టర్లను అత్యవసరాలకు మాత్రమే వాడాలని చెబుతారని, కానీ అధికార పార్టీ నేతలు మాత్రం పెళ్లిళ్లకు, బీహార్ రాజకీయాలకు వాటిని వాడుతున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కనీసం తాగడానికి నీరు లేక వర్షపు నీటినే తాగుతున్నారని, ధూప్ సింగ్ తాండా లాంటి అనేక గ్రామాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని కోరారు.