TELANGANA

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర వాదోపవాదాల నడుమ తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లను సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది.

 

అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ప్రభుత్వం ఈ రెండు బిల్లులను సభ ముందుకు తెచ్చింది. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి, బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పంచాయతీరాజ్ చట్టం-2018, మున్సిపాలిటీల చట్టం-2019 వల్లే రిజర్వేషన్లు 50 శాతానికి మించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీసీల సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

 

మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి నిజాయతీ లేదని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం మార్చిలో ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి ఢిల్లీకి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

 

ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే మార్చిలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపామని, అవి గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఈలోగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తే, ప్రతిపక్షం గవర్నర్‌ను ప్రభావితం చేసి అడ్డుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఐదుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని, అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు సాయం చేయాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్‌ను కోరారు.

 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు