TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..! కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది.

 

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారు. లక్ష మందికి పైగా జనసమీకరణ చేసి, ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

సభా నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొని జన సమీకరణ, సభా ఏర్పాట్లపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం కామారెడ్డి పట్టణంలో మరో ముఖ్యమైన సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సమీపంలోని కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించనున్నారు.

 

కామారెడ్డి వేదికనే ఎందుకు ఎంచుకున్నారంటే?

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే, రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఏ వేదికపై అయితే హామీ ఇచ్చారో, అదే వేదికపై నుంచి విజయోత్సవ సభ జరపడం ద్వారా బీసీ వర్గాలకు బలమైన సందేశం పంపవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.