TELANGANA

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ అధిక వడ్డీల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న అప్పులను రీస్ట్రక్చరింగ్ (పునర్‌వ్యవస్థీకరణ) చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి సహకరించాలని కోరారు.

 

అదేవిధంగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ల’ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు సమావేశం అనంతరం సీఎం పేర్కొన్నారు.