TELANGANA

గోదావరి పుష్కరాలు-2027.. ఇప్పటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్..

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను ‘దక్షిణ కుంభమేళా’గా పరిగణించి, భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేవలం తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టకుండా, భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

 

తెలంగాణలో గోదావరి నది ప్రవహించే బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, అందువల్ల ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చినా తట్టుకునేలా రోడ్లు, పార్కింగ్, తాగునీరు, స్నానఘట్టాలు, వసతి వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

 

రాష్ట్రంలో గోదావరి నది సుమారు 560 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా, 74 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ప్రతి ప్రధాన ఆలయం, ఘాట్‌ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక అధికారులు, ఆలయ కమిటీలతో చర్చించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కుంభమేళా, పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు.

 

ఈ భారీ ఏర్పాట్ల కోసం స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కూడా నిధులు సమీకరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.