TELANGANA

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి వినియోగదారుల సంఘాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలతో చెరువులు, కాలువలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

మొదట చెరువులతో ప్రారంభించి పెద్ద ప్రాజెక్టుల వరకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి సంఘానికి నీటి పారుదల శాఖ నుంచి ఒక అధికారి కన్వీనర్‌గా ఉంటారని వెల్లడించారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, సభ్యులతో చర్చించిన తర్వాత సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్న కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని ఆయన అన్నారు.

 

తుమ్మిడిహట్టి ఆనకట్ట కోసం సవరణలతో డీపీఆర్ సిద్ధం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అల్మట్టి ఎత్తు పెంచవద్దనే అంశంపై సుప్రీంకోర్టులో స్టే ఉందని తెలిపారు.

 

అల్మట్టి ఎత్తు పెంపునకు తాము వ్యతిరేకమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని తెలిపారు. వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించినట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తానని చెప్పారు.