TELANGANA

రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

 

రేపు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది.

 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 9న, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.

 

వివిధ కారణాలతో న్యాయస్థానాలు స్టే విధించిన కారణంగా 14 ఎంపీటీసీలు, 27 సర్పంచ్, 246 వార్డు స్థానాలకు ఎన్నికలను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

 

తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 11, ఆ తర్వాత రోజు నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15న ఉపసంహరణ గడువు ఉంది. రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 13న నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 15, మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు అక్టోబర్ 19.