TELANGANA

శనివారం బీసీ సంఘాల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బీసీ సంఘాలు రేపు (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు బీసీలు నిర్వహిస్తున్న బంద్‌కు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే, కొందరు ఈ బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని, ఆ అడ్డుకునే వారెవరో అందరికీ తెలుసునని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లను తెచ్చిందే తామని గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. బంద్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, ‘ఒకవైపు రిజర్వేషన్లు అడ్డుకుంటూనే మరొకవైపు బంద్‌కు మద్దతు ప్రకటించి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని’ కొందరిపై పీసీసీ చీఫ్ విమర్శలు గుప్పించారు.

రేపటి బంద్‌లో తాను కూడా పాల్గొంటానని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ బంద్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నేతలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంతా రేపటి బంద్‌లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.