వరంగల్ జిల్లాలోని హనుమకొండలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరిని విడుదల చేయించేందుకు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నేరుగా జోక్యం చేసుకున్నట్లు సంచలన సమాచారం బయటపడింది. ఎస్సై తనిఖీలలో మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడిన యువకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, ఎమ్మెల్యే కుమారుడు ఫోన్ చేసి డ్రైవర్‌ను వదిలివేయాలని ఆదేశించాడు. అతడి ఆదేశంతో డ్రైవర్‌ను విడిచిపెట్టిన పోలీసులు, పక్క సీటులో ఉన్న మరో యువకుడిని మాత్రం రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది.
వేధింపులకు గురిచేసిన అనంతరం ఆ యువకుడిపై ఒత్తిడి తెచ్చి రూ.1 లక్ష వసూలు చేసినట్టు సమాచారం. ఆ మొత్తాన్ని బాధితుడు బంగారు గొలుసు తాకట్టు పెట్టి చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక్కడితో ఆగకుండా, అదే బాధితుడిపై పోలీసులు మరోసారి వేధింపులకు దిగారు. అతని వద్ద 8 గ్రాముల గంజాయి దొరికిందంటూ ఎస్సై మరో నకిలీ కేసు పెట్టారు. ఈ దాడుల్లో బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో, వారు మానవ హక్కుల కమిషన్‌ను (NHRC) ఆశ్రయించారు.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాలపై రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టగా, పోలీసుల దౌర్జన్యం, రూ.1 లక్ష వసూలు, గంజాయి కేసు నకిలీవని తేలింది. అంతేకాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని వదిలించేందుకు ఏకంగా రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొడుకు పాత్ర స్పష్టమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం సంబంధిత ఎస్సైతో పాటు ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం.

