తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రవాణా శాఖ తనిఖీ కేంద్రాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం, డిప్యూటీ రవాణా కమిషనర్లు, జిల్లా రవాణా అధికారులు (DTOs) తనిఖీ కేంద్రాల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సంకేతాలు వంటి అడ్డంకులను వెంటనే తొలగించాలని, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
తనిఖీ కేంద్రాల వద్ద ఇకపై ఎవరూ ఉండరాదని కమిషనర్ ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇతర శాఖలకు పునర్నియోగం చేయాలని సూచించారు. అలాగే, తనిఖీ కేంద్రాల వద్ద ఉన్న రికార్డులు, గృహోపకరణాలు, పరికరాలను వెంటనే జిల్లా రవాణా కార్యాలయాలకు తరలించాలని, ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి, భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలుపై సమగ్ర నివేదికను సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ తనిఖీ కేంద్రాలపై గత ఆదివారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ వంటి పలు జిల్లాల్లోని చెక్ పోస్టులపై జరిగిన దాడుల్లో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. నిరంతర అవినీతి ఆరోపణలు, వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.

