TELANGANA

జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం: కేసీఆర్ ధీమా, వ్యూహాలపై దిశానిర్దేశం

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ నేతలతో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

సమావేశంలో కేసీఆర్ డివిజన్ల వారీగా ప్రచారం తీరు, ప్రజల స్పందనపై నేతలను ఆరా తీశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను హైలైట్ చేస్తూ ప్రచారం కొనసాగించాలని సూచించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేసి విజయాన్ని సాధించాలని కోరారు.

ఈ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాగంటి సునీతకు కేసీఆర్ ప్రత్యేకంగా సూచనలు చేశారు. బాధను దిగమింగి, దృఢంగా ముందుకు వెళ్లాలని ఆమెకు ధైర్యం చెప్పారు. మాగంటి సునీతకు కేసీఆర్ అండగా నిలవడం, గెలుపుపై ఇంతటి ధీమా వ్యక్తం చేయడంతో జూబ్లీహిల్స్ బైపోల్ మరింత ఆసక్తికరంగా మారింది.