తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులతో కలిసి రెండు, మూడు రోజుల్లోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ భేటీ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నా, కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కనీసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని, రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ వేవ్ కనిపిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి సాధ్యపడదని, ఓడిపోయే వాళ్లు సర్వసాధారణంగా నిందలు వేస్తారని ఆయన కొట్టిపారేశారు. అలాగే, తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, టీపీసీసీ అధ్యక్షుడి పదవికే మొగ్గు చూపుతానని ఆయన స్పష్టం చేశారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం తన కోసం చేసింది కాదని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.

