జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించి, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. నవీన్ యాదవ్‌కు మొత్తం 99,120 ఓట్లు రాగా, మాగంటి సునీతకు 74,462 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి 24,658 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
రౌండ్ల వారీగా జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నిలకడగా ఆధిక్యాన్ని కొనసాగించారు. మొదటి రౌండ్ నుంచే స్వల్ప మెజార్టీ సాధించిన ఆయన, ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం పెంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 5వ రౌండ్‌లో ఏకంగా 2000కు పైగా ఓట్ల లీడ్‌ను దక్కించుకున్నారు. 7 రౌండ్లు ముగిసేసరికి ఆయన మెజార్టీ 20 వేలకు పైగా చేరుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమ పాలనకు ప్రజా తీర్పు అనుకూలంగా ఉందని చాటుకోవాలని భావించింది.
ఈ ఉపఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే, ఇది ప్రజా ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టినట్లుగా భావించారు. అదే బీఆర్ఎస్ గెలిస్తే, రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండంగా చెప్పాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మళ్లీ మూడో స్థానానికి పరిమితమై, ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు.

