జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తమమే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చి చెప్పినట్లు అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తాము ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రుజువు చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల తీరుపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని కేటీఆర్ కోరారు. ఎన్నికల విధానం, గెలుపు ఓటముల కంటే కూడా ప్రజాస్వామ్యంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే తాము అనేక అంశాలను బయటకు తీసుకువచ్చినా, ఎన్నికల కమిషన్ వాటిని పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓట్లు పోలయ్యాయని చెబుతున్నా తమ మొరను ఎవరూ వినలేదన్నారు.
అయితే, ఈ ఓటమి కారణంగా తాము నిరాశ చెందడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఫలితాన్ని పక్కన పెట్టి, ఇకపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముందుకు వెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ ఓటమి బీఆర్ఎస్‌కు పోరాడే శక్తిని ఇచ్చిందని, ప్రతిపక్షంగా మరింత బలంగా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని కేటీఆర్ సందేశం ఇచ్చారు.

