ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈరోజు (శనివారం) ఉదయం సీసీఎస్ పోలీసులు కూకట్పల్లి ప్రాంతంలో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత ఉదయం నుంచి సీసీఎస్ పోలీసులు అతడిని విచారించి, అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలో ఉన్న మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ, కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నాడు.
ఐబొమ్మ వెబ్సైట్ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షం కావడంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి వెబ్సైట్లో చూసేస్తున్నారు. దీంతో తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఐబొమ్మ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్‌లను పట్టించుకోకుండా, దమ్ముంటే తమను పట్టుకోవాలని వారు ఏకంగా పోలీసులకే సవాల్ విసిరారు.
పోలీసుల సవాల్‌ను స్వీకరించి, సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు అదుపులోకి రావడం తెలుగు సినిమా పరిశ్రమకు ముఖ్యమైన విజయం. పైరసీపై నిరోధ చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలను తగ్గించడానికి ఒక బలమైన సంకేతంగా నిలుస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు అతడికి ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.

