TELANGANA

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల (ఖచ్చితంగా రూ. 578.86 కోట్లు) విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగానే మద్యం అమ్మకాలు ఇంత భారీగా పెరిగాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చలి వాతావరణం ఉన్నప్పటికీ, మద్యం ప్రియులు చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడవగా, ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఈ నెలలో ఇంకా మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, వివిధ ప్రాంతాల్లో మద్యం వినియోగం పెరుగుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ రికార్డు స్థాయి అమ్మకాలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.