నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా చేయలేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు వేయడంలోనే బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తూ, మీడియాకు లీకులు ఇస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మండిపడ్డారు.
సాగునీటి రంగంపై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన గానీ, చిత్తశుద్ధి గానీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నదీ జలాల విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన సత్తా చాటిందని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రికి దమ్ముంటే తక్షణమే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ఇప్పుడు నోటీసుల డ్రామాతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను గమనిస్తున్నారని, త్వరలోనే రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ సైనికులు భయపడరని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

