తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికీ 250 గజాల నివాస స్థలాన్ని అందిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కరీంనగర్ జిల్లాలో ఆమె “భూ పోరాటం” ప్రారంభించారు. అంతకుముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, అనంతరం మానకొండూరు సమీపంలో భూ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని అర్హులైన ఉద్యమకారులకు పంపిణీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని సుమారు ఐదు ఎకరాల భూమిని ఉద్యమకారుల కోసం స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వం స్పందించకుంటే తామే ఆ భూమిని సాగు చేసుకుంటామని లేదా పంచుకుంటామని హెచ్చరించారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఉద్యమకారుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం అన్యాయమని ఆమె విమర్శించారు.
ఈ భూ పోరాటం కేవలం కరీంనగర్‌కే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులతో కలిసి నిరసనలు చేపడతామని కవిత స్పష్టం చేశారు. “ఇల్లు లేని ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం 250 గజాల స్థలం ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు మరియు తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.

