TELANGANA

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా: ఒకేసారి 47 మంది కమిషనర్ల బదిలీ!

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో పరిపాలనాపరమైన మార్పులు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలకు అనుగుణంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో పురపాలక శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు, అలాగే ఒకే ప్రాంతంలో మూడేళ్లకు పైగా సుదీర్ఘ కాలం పనిచేస్తున్న అధికారులను ఈ బదిలీల జాబితాలో చేర్చారు. కొంతమంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్న అధికారులు తక్షణమే తమ పాత బాధ్యతల నుంచి తప్పుకుని, కేటాయించిన కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కీలకమైన బదిలీలను గమనిస్తే.. ఆదిలాబాద్ గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సి.వి.ఎన్. రాజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అలాగే క్యాతనపల్లి నుంచి జి.రాజు ఆదిలాబాద్‌కు, నల్గొండ నుంచి ముసాబ్ అహ్మద్ హుజూరాబాద్‌కు, ఆలేరు నుంచి బి.శ్రీనివాస్ హుజూర్ నగర్‌కు బదిలీ అయ్యారు. బి.శరత్ చంద్ర పదోన్నతి పొంది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ భారీ బదిలీలతో రాష్ట్రంలోని మున్సిపల్ యంత్రాంగం అంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోయింది.