ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి తాను బెదిరింపులకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను అధికారులను నిలదీయగా, అటువంటి లీకులు తాము ఇవ్వలేదని, ఆ ప్రచారంలో నిజం లేదని వారు అంగీకరించారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం కావాలనే లీకులిస్తూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
సిట్ విచారణ అంతా కాలక్షేపంలా సాగిందని, అధికారులు అడిగిన ప్రశ్నలనే పదేపదే అడిగారని కేటీఆర్ విమర్శించారు. విచారణ సమయంలో తాను, అధికారులు తప్ప మరెవరూ లేరని.. మరొకరితో కలిపి తనను విచారించారనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ ప్రభుత్వం కేవలం లీకుల మీద నడుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తాము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టే విచారణకు హాజరయ్యామని, భయపడే వాళ్లమైతే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని ఒక మంత్రే తన ఫోన్ ట్యాప్ అవుతోందని ఆరోపించడాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు మరియు మంత్రులపై వస్తున్న భూదందాలు, అవినీతి ఆరోపణలపై సిట్ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

