నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధికి నోచుకోలేదని, అది చెత్తకుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికే తమ ప్రభుత్వం 1,045 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకువచ్చే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ నిజామాబాద్‌ను ‘స్మార్ట్ సిటీ’ పథకంలోకి ఎందుకు చేర్చలేకపోయారని ప్రశ్నించారు. “గల్లీలో మోరీలు తీయాలన్నా మోదీ రావాలా?” అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెడతామని ప్రగల్భాలు పలికే బీజేపీ నేతలు, ఇప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘కల్వకుంట్ల కిషన్ రావు’గా మారి వారిని కాపాడుతున్నారని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య విడదీయలేని ‘ఫెవికాల్ బంధం’ ఉందని ఆరోపించారు.
కులగణన, వర్గీకరణ వంటి అంశాలపై తనను బీజేపీ నేతలు ‘రేవంతుద్దీన్’ అని పిలవడం పట్ల సీఎం ఘాటుగా స్పందించారు. పేదల కోసం పని చేస్తున్న తనను ఏ పేరుతో పిలిచినా సంతోషమేనని, అన్ని మతాలను, కులాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

