తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ సత్తాను చాటారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పంథాను అనుసరిస్తున్న ఆమె, తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు ఘనంగా కైవసం చేసుకున్నారు. కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, కవిత మద్దతుదారులు ఏకంగా 8 వార్డులను గెలుచుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. వీరంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ తరఫున ‘సింహం’ గుర్తుపై పోటీ చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా హవా చూపిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం ఒక వార్డుకే పరిమితం కాగా, బీఆర్ఎస్ కూడా ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. క్షేత్రస్థాయిలో తెలంగాణ జాగృతి ద్వారా చేసిన సేవా కార్యక్రమాలే తమను గెలిపించాయని విజేతలు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్త ఫలితాల సరళిని పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన 43 మున్సిపాలిటీల ఫలితాల్లో కాంగ్రెస్ 36 స్థానాలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 7 చోట్ల విజయం సాధించింది. అయితే, ఏ పార్టీ అండ లేకుండా కేవలం ఒక సామాజిక సంస్థ మద్దతుతో మున్సిపాలిటీని గెలుచుకోవడం ద్వారా కవిత అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ గెలుపు ఉత్సాహంతో వడ్డేపల్లిలో కవిత అనుచరులు బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

