రాష్ట్ర మంత్రుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని, త్వరలోనే దానిని బహిర్గతం చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మంత్రుల అవినీతి దందాలకు మధ్యవర్తులుగా మారుతున్నారని, వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ (TPCC) అంటే “తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్ కాంగ్రెస్” అని ఎద్దేవా చేస్తూ, 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడుల ప్రకటనలను సంజయ్ తప్పుబట్టారు. ‘తెలంగాణ రైజింగ్’ మరియు దావోస్ పర్యటనల ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం, వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, తమ కార్పొరేటర్లను ప్రలోభపెట్టేందుకు కార్లు, బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ నగర పాలనపై మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేయడం కేవలం మజ్లిస్ పార్టీని సంతృప్తి పరచడానికేనని సంజయ్ ఆరోపించారు. హిందూ ఓట్లను చీల్చేందుకే ఈ విభజన కుట్ర పన్నారని, ప్రజాభిప్రాయం లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని మండిపడ్డారు. గత రెండేళ్లలో నగర అభివృద్ధికి కాంగ్రెస్ ఏమీ చేయలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

