తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్న తన సంస్థ ఇకపై రాజకీయ వేదికగా మారుతుందని, పార్టీ పేరులో కచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ కరువైందని, ఆ ఖాళీని భర్తీ చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో క్లారిటీ ఇస్తూ, తన మొదటి ప్రాధాన్యత (ఫస్ట్ ఛాయిస్) సిద్దిపేట అని కవిత ప్రకటించారు. హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఆమె పరోక్షంగా సవాల్ విసిరినట్లయింది. ఒకవేళ సిద్దిపేట కుదరని పక్షంలో తన రెండో ప్రాధాన్యతగా బోధన్ నియోజకవర్గం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేసిన కవిత, తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ఒక కుటుంబం లేదా వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పనిచేసే వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ జెండా, ఎజెండా మరియు పూర్తిస్థాయి విధివిధానాలను వెల్లడించనున్నట్లు ఆమె మీడియా ఇష్టాగోష్టిలో తెలిపారు.

