TELANGANA

శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు: జలమండలి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

కోకాపేటలోని విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఠానికి కేటాయించిన స్థలంలో జలమండలి (HMWSSB) చేపట్టిన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. జలమండలికి ఆ భూములను కేటాయిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ భూముల్లో జలమండలి నిర్మాణ పనులు ప్రారంభించడాన్ని శారదా పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీఠానికి కేటాయించిన భూమిలో పనులు చేపట్టినప్పుడు, అక్కడి స్థితిగతులను తనకు ఎందుకు వివరించలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ స్థలంపై జలమండలికి ఉన్న హక్కులను రద్దు చేసి, సదరు భూమి శారదా పీఠం పరిధిలోనే కొనసాగేలా చూడాలని ఆదేశించారు.

హైదరాబాద్ శివార్లలోని అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో ఈ భూకేటాయింపుల వివాదం ఇప్పుడు రాజకీయంగానూ, ఆధ్యాత్మిక వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆదేశాలతో జలమండలి అక్కడ చేపట్టిన పనులను నిలిపివేసింది.