TELANGANA

రాహుల్ గాంధీ దేశంలోనే అతిపెద్ద జోకర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం అత్యంత అప్రజాస్వామికమని, దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం ఉందని, ఆయన ఒత్తిడి మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ రక్షకుడినని చెప్పుకుంటూనే, మరోవైపు తెలంగాణలో అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫిరాయింపులకు పాల్పడే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దు కావాలని ఢిల్లీలో నీతులు చెప్పే రాహుల్, ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు. చెప్పేవి నీతులు, చేసేవి అనైతిక పనులు అన్నట్లుగా రాహుల్ తీరు ఉందని, అందుకే ఆయన దేశంలోనే అతిపెద్ద ‘జోకర్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నుంచి వస్తున్న నిధుల మూటల కోసమే రాహుల్ గాంధీ ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీ బీ-ఫామ్‌తో ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కూడా అనర్హత వేటు వేయకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని, దీనికి రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించాలని ఆయన సవాల్ చేశారు.