కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చారు. మంచిర్యాల ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు యువతులకు ఉద్యోగాల పేరుతో ఎర వేసిన నిందితులు, వారిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్లు సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. బాధితులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఈ ఉదంతం సుఖాంతమైంది.
ఈ కేసు వివరాల ప్రకారం, కిష్టంపేట్ గ్రామానికి చెందిన ముదిమాడుగుల ప్రశాంత్ మరియు అతని భార్య సవిత బాధితులకు పని కల్పిస్తామని నమ్మించి పరిచయం పెంచుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మహేష్ అనే వ్యక్తి సహాయంతో వీరు బాధితులను బలవంతంగా రైలు ఎక్కించి మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాధితుల ఇష్టానికి విరుద్ధంగా, నిందితులు తామే వారి మేనమామలమని అబద్ధం చెప్పి స్థానికులతో వివాహాలు జరిపించారు. ఒక్కొక్కరి భర్త వద్ద నుండి రూ. 2.50 లక్షల చొప్పున మొత్తం ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి లాభం పొందినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బాధితులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్ వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మీడియా సమావేశంలో బెజ్జూర్ ఎస్ఐ సర్తాజ్ పాషా పాల్గొని, మహిళలు ఇటువంటి మోసపూరితమైన ఉద్యోగ వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

