తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఈ ఫాంహౌస్‌ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ‘అసైన్డ్ భూమి’లో నిర్మించినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించడమే కాకుండా, డ్రగ్స్ పార్టీకి వేదికగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీకి హాజరైన వారి వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసినట్లు భావిస్తున్న ప్రధాన పెడ్లర్ అభిషేక్ సింగ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అభిషేక్ సింగ్, ఈ పార్టీకి అవసరమైన మాదకద్రవ్యాలను చేరవేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో అభిషేక్ నుంచి డ్రగ్స్ స్వీకరించినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కౌశిక్ రవి ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే అభిషేక్ సింగ్‌ను పట్టుకున్నట్లు సమాచారం.
ఈ కేసులో రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు ఈ కేసులో నోటీసులు అందగా, ఆయన స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. అభిషేక్ సింగ్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న సిట్ అధికారులు, ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మంది ప్రముఖులకు నోటీసులు అందే అవకాశం కనిపిస్తోంది.

